
బతుకు లెక్క
చేను అమ్మేద్దాం…
వచ్చిన లెక్కతో అప్పులు కట్టేసి, సూరి ఫీజు కట్టేయొచ్చు అని రాధమ్మ పెద్ద కొడుకు శంకర్‌తో చెప్పింది.
"చేను కూడా పోతే ఇల్లు ఎట్లా నడుస్తుంది, అమ్మా?" అని శంకర్ దిగులుగా అన్నాడు.
రాధమ్మ చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో ఆశ కంటే అలసటే ఎక్కువగా కనిపించింది.
"ఇప్పుడైనా ఏం గడుస్తుంది, నాయన... సాలుకు సాలు పెట్టుబడి కూడా రాడంల్యా. వానలు పడి పంట బాగా వస్తే గిట్టుబాటు రేటు ఉండదు. పడకపోతే పంట రాదు. మనల్ని నమ్మి ఎరువులు కొండానికికూడా అప్పు ఇయ్యడం ల్యా ఎవరును..." అని తన నిస్సహాయతను బయటపెట్టింది.
శంకర్ మౌనంగానే "సరే అమ్మ" అన్నట్టు తలూపాడు.
ఆ మాట విన్నాక రాధమ్మ ముఖంలో ఒకింత ఉపశమనం కనిపించింది.
"అక్కా…"
ఇద్దరూ తల తిప్పి చూశారు.
సుబ్బాడ్డి... స్థలాల బ్రోకర్ వ్యాపారం చేస్తుంటాడు.
పక్కనే నిలబడి విన్నట్టుగా, ఎండాకాలపు వేడి గాలిని తీసుకొని లోపలికి వచ్చాడు.
"ఏంల్యాక్కా... ఈ పక్క నుంచి పోతాంటే ఓ విషయం గుర్తొచ్చి వచ్చినా. మీ పొలం పక్కన ఉన్న యెరువొల్ల సీకాంతువి నాలుగు ఎకరాలని ఒక ఆసామి కొన్నాడు, ఎకరా అరవై వేల చొప్పున...
మంచి రేటు కదా. మీరు కూడా అమ్ముతారేమో చెప్దామని వచ్చిన..." అన్నాడు.
వెంటనే అందుకుంటూ, "ఈ కాలంలో భూమిని నమ్ముకొని ఉండలేం కా... ఒక ఏడు గిడితే, మళ్ళా మూడేళ్లు అస్సలు కూడా రాదు. మీ చేనుకాడికి కలుపు తీయడానికి కూలోళ్ళ రారు. మందు కొట్టాలన్న మీకు పలకరు, దూరం అని.
ఆ గోసిపాత కోసం కుటుంబం అంత కష్టపడాల్నా... చేనుకాడికి పోయినపుడల్లా పిల్లల సదువు కుంటూ పడ్తాంటాది. ఇచ్చావంటే చెప్పు. మనకని చెప్పి ఒక ఐదు వేలు ఎక్కువకి మాటాడత. వచ్చిన లెక్కతో చిల్లర అంగడి పెట్టుకో, ఇల్లైనా గడుస్తుంది," అంటూ ఉచిత సలహా ఇచ్చాడు.
65 వేల మాట వినగానే రాధమ్మ, శంకర్‌లకు ఒక్కసారిగా దిగులు ముంచుకొచ్చింది.
శంకర్ నాన్న రామన్నకి ఉండటానికి సొంత సవుడు మిద్దె, ఎకరా భూమి. దాంతో పాటు పెద్దలు చేసిన కొంత అప్పు వారసత్వంగా వచ్చాయి. భూమి కూడా ఊరికి పది కిలోమీటర్లు దూరంగా ఉంది.
రామన్న పెద్దగా కష్టపడే మనస్తత్వం ఉన్న మనిషి కాదు. అలా అని దుబారా చేసే వాడు కూడా కాదు. వ్యవసాయం తో పాటు చెనిక్కాయల వ్యాపారం చేసేవాడు. వ్యాపారంలో వచ్చిన ఆదాయం అంత చెనిక్కాయల ఫ్యాక్టరీకి వెళ్తూ వస్తున్నపుడు వచ్చిన టీబీ జబ్బు నయం చేసుకోడానికి సరిపోయింది. అది కూడా ఎక్కువ కాలం సాగలేదు. బయటకి నయమైనట్టు కనిపించిన లోలోపల తినేస్తూ వచ్చింది. పెద్ద కొడుకు శంకర్ ఐదో తరగతి చదువుతున్నప్పుడు రామన్న చనిపోయాడు.
ఇంటి బరువు ఒక్కసారిగా రాధమ్మ, శంకర్ల మీద పడింది.
తినీ తినక, ఎలాగోలా రోజులు నెట్టుకొస్తున్నారు.
ఉన్న ఒక ఎకరం భూమే వాళ్లకి జీవనాధారం.
కానీ ఆ భూమి కూడా వాళ్లని పూర్తిగా నిలబెట్టలేకపోయింది.
సుబ్బాడ్డి చెప్పినట్టే కూలీలు దూరం అని రావడం లేదు. కలుపు తీయాలన్న, పంట కోయాలన్న తల్లికొడుకు ఇద్దరూ వెళ్లాలి.పురుగు మందు కొట్టాలంటే కొందరు “మీరిచ్చే లెక్క అంత దూరం పోడానికిడీజిల్ కె సరిపోతాది” అనేటోళ్లు.మరికొందరు “మందు కొట్టినం” అని చెప్పి డబ్బు తీసుకొని వెళ్ళిపోయేవారు.
అది నిజమో అబద్దమో వాళ్లకి తెలియదు.
చుట్టుపక్కల వాళ్లు ఏ పంట వేస్తే అదే వేయాలి. వేరే పంట వేస్తే పురుగు పట్టి నాసిరకం పంట వస్తుంది.
గత పదేళ్లుగా ఒకటే పంట శనగ. రేటు ఉన్నా లేకున్నా అదే.పెద్ద భూస్వాములు శనగను నిల్వ పెట్టుకుంటారు. మంచి రేటు వచ్చినప్పుడు తీసి అమ్ముతారు.
కానీ రాధమ్మకి ఆ అవకాశం లేదు.
పంట చేతికి వచ్చేసరికి ఏ రేటు ఉంటే అదే.లేకపోతే పెట్టుబడికి తెచ్చిన అప్పు వడ్డీ పెరుగుతూనే ఉంటుంది.
ఇపుడు సూరి ఇంటర్ పూర్తి చేసి EAMCET రాశాడు, ఫ్రీ సీట్ రాలేదు. కానీ మంచి కాలేజీలో సీట్ వచ్చే ర్యాంక్ వచ్చింది.
కష్టం అయినా, నష్టం అయినా భరిస్తూ ఇన్నాళ్లు గడిపారు.
పిల్లాడి చదువుకైనా పనికొస్తుంది అనే ఆలోచన ఇన్నేళ్ల ఓపికని ఆవిరి చేసింది. రాధమ్మకి భూమి అమ్మాలనే కఠిన నిర్ణయం తీసుకునేలా చేసింది.కానీ సుబ్బాడ్డి చెప్పిన అరవై ఐదు వేల రేటు విన్నాక ఆ ఆలోచనే చిన్నబోయింది.
ఇప్పటికే అరవై వేల అప్పులు ఉన్నాయి. కాలేజ్ ఫీజు, ఖర్చులు కలిపితే కనీసం ముప్పై అయిదు వేల అవుతాయి. చిన్న చిల్లర అంగడి పెట్టాలంటే పదివేల సరుకు కావాలి. బంకు పెట్టాలంటే ఐదు వేలైనా కావాలి. మొత్తం చూసుకుంటే కనీసం లక్షా పది వేలైనా రావాలి.
అరవై ఐదువేలు దేనికి సరిపోవు.
తల్లికొడుకులిద్దరు ఒకేలా ఆలోచిస్తున్నారు.
చివరికి శంకర్ తేరుకుని ఇలా అన్నాడు, “ఏమైనా ఉంటే నేను వచ్చి చెప్తాలే మామా.”
సుబ్బాడ్డి తల ఊపి అక్కనుంచి వెళ్లిపోయాడు.
(ఒక వారం గడిచింది.)
ఆ వారం వరకు శంకర్ మళ్లీ ఆ విషయం ప్రస్తావించలేదు. రాధమ్మ కూడా అడగలేదు. ఇద్దరికీ ఒకే ఆలోచన, భూమి అమ్మాలి అనిపిస్తోంది… కానీ అంత తక్కువ రేటుకి అమ్మితే ఏమి ఉపయోగం ఉండదు.
ఒక మధ్యాహ్నం సుబ్బాడ్డి మళ్లీ వచ్చాడు. వచ్చి గుమ్మం దగ్గరే నిలబడి అన్నాడు.
“ఏమక్కా… నేను చెప్పిన విషయం ఏమైనా ఆలోచించారా?”
రాధమ్మ అతన్ని కాసేపు చూసింది.
“ఆలోచించేది ఏముంది అన్నా… మేమున్న పరిస్థితి నీకు తెలియనిది కాదు. నువ్వు మొన్న వచ్చే ముందరే మాటాడుకుంటుంన్యాం, చేను అమ్మెయ్యాలని. కానీ నువ్వు రేటు చెప్పింతర్వాత ఏమి అర్థంకాకా ముందుఎనకా అవుతండం... నువ్వు చెప్పిన రేటుకు అమ్మితే వచ్చిన లెక్క మాకు దేనికి తరం కాదు.”
సుబ్బాడ్డి తల ఊపి… “అవుక్క నేను మీరెంత కమ్మేది అడగకుండానే బెర్రీన పోయిన. ఇపుడు చెప్పు, ఎంతకైతే ఇచ్చారు?”
రాధమ్మ మాట్లాడబోతుండగా శంకర్ ముందుకొచ్చి, ఉన్న విషయమంతా నిజాయతీగా చెప్పి, “లక్షా పది వేలకు మాటాడు మామ, అప్పుడితేనే అప్పులు, ఫీసులకి సరిపోతాయి” అన్నాడు.
“అంత లోపల ఉన్న చేనుకి అంతయాడిచ్చాడబ్బా... ఒక మాట చెప్పి సూజ్చా, ఏమంటాడో సూజ్జం” అని అక్కనుండి లేచాడు సుబ్బాడ్డి.
అతను బయటికి వెళ్లబోతుండగా శంకర్ ఒక్కసారిగా గుర్తొచ్చినట్టు పిలిచాడు.
“మామా…”
రాధమ్మ వినకూడదన్నట్టు కాస్త నెమ్మదిగా మాట్లాడాడు.
“సూరికి నాలుగు రోజుల్లో కౌన్సిలింగ్ ఉంది. ఎట్టో అట్టా మాట్లాడి రేటు వచ్చేట్టు చూడు మామా. లేదంటే యాడైనా చేబదులైన అయినా ఇప్పించు. నా స్కాలర్షిప్ వచ్చిన తర్వాత రెండు సార్లుగా ఇచ్చేస్తా. ఈ ఒక్కసారికి సూడు మామ.”
సుబ్బాడ్డి కొంచెం ఆలోచించినట్టు చేసి అన్నాడు.
“సర్లే… చూస్తా” అని చెప్పి అక్కనుంచి వెళ్ళిపోయాడు.
(రెండు రోజులు గడిచాయి.)
కౌన్సిలింగ్ కి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉన్నాయి.
శంకర్ మనసు ప్రశాంతంగా లేదు. సుబ్బాడ్డి దగ్గరికి వెళ్లి అడగాలని అనుకున్నాడు.అతని ఇంటి వైపు నడుస్తుండగా సుబ్బాడ్డి, తానే ఎదురొచ్చాడు.
“నిన్నే వెతుక్కుంటూ వస్తున్నా రా.”
శంకర్ ఒక్కసారిగా ఆగిపోయాడు.
“ఏమైంది మామా?”
సుబ్బాడ్డి ముఖంలో చిన్న నవ్వు.“ఎవరి అదృష్టమో గానీ… ఆసామి నువ్వు చెప్పిన రేటుకంటే ఇంకా ముప్పై వేల ఎక్కువ ఇస్తా అన్నాడు.”
శంకర్ నమ్మలేకపోయాడు.
“ఎంత?”
“లక్షా నలభై.”
కొద్దిసేపు శంకర్ మాట్లాడలేకపోయాడు.
సుబ్బాడ్డి కొనసాగించాడు.
“సూరి రెండు సంవత్సరాల ఫీజులు కూడా సెట్ అయిపోతాయి.”
శంకర్ ముఖంలో కనిపించిన ఆనందం చూసి సుబ్బాడ్డి నవ్వాడు.
“ఈ మాటే అమ్మకి చెప్దాము” అని వస్తున్నా.
ఇద్దరూ ఇంటి వైపు నడుస్తుండంగా శంకర్ ఇలా అన్నాడు, “మామ, ఇందులో తిరకాసు ఏమి లేదు కదా? 65 అని చెప్పి డబల్ రేటు ఎలా ఇవ్వడానికి ఒప్పుకున్నాడు?”
పేదోడికి అదృష్టం వచ్చినా ముందుగా భయమే వేస్తుంది.
“పిల్లోని తీరుగానే ఉన్నావనుకున్న, పెద్దొనివి అనిపించుకున్నావ్... ఎమీల్యా రా! ఆరోజు మీ ఇంటి కాన్నుంచి పోయినంక ఆసామీ నన్ను సూచనే అన్నాడు, ఎనభై ఇజ్జంపో అని. నువ్వు లక్ష్యపది అడిగింది, మీ పరిస్థితి అంత చెప్పిన... మాటల మధ్యలో మీ నాయన విషయం వచ్చేలే. నాయన పేరు ఇనగానే మనిషి ఉబ్బిపోయినాడు... ఆయప్ప మునిసిపాలిటీ లో ఉజ్జోగం రానికి, ఆస్తులన్నీ సంపాదించడానికి మీ నాయన కారణం అంట. మీ నాయనా ఆ ఉజ్జోగం వద్దనింటే ఈయప్పకి వచ్చిందంట. ఎంత కాదనుకున్న, నా సంపాదనకు మీ నాయన కారణం అని ఆ రేటు ఈనికి ఒప్పుకున్నాడు.”
శంకర్ మనసులో ఏదో అనిపించింది.
సుబ్బాడ్డి ఇంకా చెప్తున్నాడు.
“మరొక విషయం… కాలేజ్ ఫీజు గురించి చెప్పా. ‘అయితే ఆసామి ఇంటికే వచ్చి డబ్బు తీసుకెళ్లమని చెప్పు’ అన్నాడు. రిజిస్ట్రేషన్ తర్వాత అయితే ఆలస్యం అవుతుందని.”
“ఆయప్ప ఉండేది ఎక్కడ?”
“కడపలోనే.”
శంకర్ కొద్దిసేపు మౌనంగా నడిచాడు.అన్ని సరిగ్గా జరుగుతున్నట్టే ఉన్నాయి. కానీ ఎందుకో మనసులో చిన్న సందేహం మాత్రం పోవడం లేదు.
(కౌన్సిలింగ్ కి ముందు రోజు.)
అన్నదమ్ములిద్దరూ చిన్న బ్యాగ్‌లో రెండు జతల బట్టలు, కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకున్నారు.ఉదయం బస్సు ఎక్కి కడపకు బయలుదేరారు.
మధ్యలో సూరి అడిగాడు, “అన్నా… ఫీజు డబ్బు?”
శంకర్ బస్సు కిటికీ నుండి ఎటో చూస్తూ “అడ్జస్ట్ అయ్యింది లే.” అన్నాడు
బస్సు దిగాక ఆసామి ఇంటి దగ్గరికెళ్లి సుబ్బాడ్డికి ఫోన్ చేసాడు శంకర్. ఆ ఇల్లు పట్టణం అంచున ఉన్న పాతకాలపు ఇళ్ల వరుసలో ఉంది.
"ఆఁ శంకరు, ఆసామి ఏదో అర్జెంటు పని మీద హైదరాబాద్ పోయినాడంట. లక్షన్నర ఇంట్లో పెట్టి, మీకియ్యమని ఇంటామెకు చెప్పడం మర్చిపోయినాడంట. ఆమె నాకోసమే ఇచ్చాడని ఎనభై వేలు గాజులు కొందామని అడ్వాన్స్ ఇచ్చింది అంట. ఇపుడు ఆమె ఇచ్చేది తీసుకుని కాలేజీ ఫీజు కట్టి రండి,మిగతాది తర్వాత తీస్కుందాం " అన్నాడు సుబ్బాడ్డి.
శంకర్ మొహంలో “మోసపోతున్నానా?” అని తన మీద తనకే జాలి వేసింది. ఏది సరిగ్గా అనిపించడం లేదు. ఆసామి తో డైరెక్ట్గా ఎపుడు మాట్లాడలేదు. సుబ్బాడ్డి కూడా ఎందుకంత సహాయం చేస్తున్నడానిపించింది.ఇవి అన్నీ గమనించకుండ ఉండేంత అమాయకుడు కాదు.కానీ అతని తలలో ఒక్క ఆలోచనే తిరుగుతోంది.
సూరి కౌన్సిలింగ్ మిస్ అవ్వకూడదు.
అప్పులు, ఇంటి ఖర్చులు, తల్లి ముఖం… అన్నీ ఒకేసారి గుర్తొచ్చాయి.
“ఇప్పుడు అనుమానిస్తా కూర్చుంటే పని జరగదు,” అని తనలో తానే చెప్పుకున్నాడు.
ఏం జరిగితే అది తర్వాత చూద్దాం, ఇప్పుడు ఈ పని పూర్తవ్వాలి అనుకున్నాడు.
వెంటనే తేరుకుని, ఇంకా భూమి పేపర్స్ మనదగ్గరే ఉన్నాయి కదా, తర్వాత గట్టిగా అడిగినా అప్పులాగా తీర్చేద్దాం అని నిశ్చయించుకుని...
"మామ, మేము ఇంకో రోజు ఈడే ఉంటాం. మొత్తం డబ్బు ఇచ్చేలా చూడు," అంటూ సుబ్బాడ్డి కి ఫోన్ చేసి చెప్పినాడు.
"అసాధ్యునివే రా నువ్వు! ఉండు, ఒకసారి చెప్పి చూస్తా" అని ఫోన్ పెట్టేసాడు.
5 నిమిషాల తర్వాత ఫోన్ వచ్చింది శంకర్ కి...
"ఆసామి మొత్తం ఇచ్చా అన్నాడు. కాకపోతే ఇంట్లో ఇచ్చింది తీసుకొని, మిగతా దానికోసం ఒక అడ్రస్ చెప్పినాడు. ఆడికి పోయి తీసుకోండి."
సూరిని బయట ఉండమని చెప్పి, శంకర్ బ్యాగ్ తీసుకొని లోపలికి పోయినాడు. ఒక 20 నిమిషాల తర్వాత బయటికొచ్చాడు.
సూరికి చెప్పాలా వద్దా అని క్షణం ఆలోచించాడు.
చెప్తే వాడు ఒప్పుకోడు. “చేను అమ్మొద్దు అన్నా” అంటాడు.
ఇప్పుడు వాదనలు పెట్టుకునే టైం లేదు.ముందు వాడి చదువు సెట్ కావాలి.మిగతా సంగతి తర్వాత చూసుకుంటాం అనుకుని డబ్బు bundle లను బ్యాగ్ అడుగున పెట్టాడు. ముందులాగ బట్టలు, డాక్యుమెంట్స్ పెట్టాడు.
బ్యాగు ఫోన్ సూరి చేతికిచ్చి, "జాగ్రత్తగా ఇక్కడే ఉండు... ఇపుడే వస్తాను," అని చెప్పి సుబ్బాడ్డి ఇచ్చిన అడ్రస్ కి నడుచుకుంటూ బయల్దేరినాడు.
అర్ధ గంట అయింది, శంకర్ ఇంకా రావడం లేదు. సూరికి విసుగొస్తుంది.
సూరి మొదట కూర్చున్నాడు. తర్వాత నిలబడ్డాడు. మళ్లీ నడిచాడు. పట్టణం కొత్తది. చుట్టూ తెలియని రోడ్లు.కొద్దిసేపటికి మూత్రం పోయాలన్న ఒత్తిడి వచ్చింది.చుట్టూ చూసాడు. జనాలు తిరుగుతున్న వీధి.పబ్లిక్ టాయిలెట్ కనిపించలేదు.కొంచెం దూరంలో కాల్వ గట్టు లాంటి ప్రదేశం కనిపించింది.“అక్కడికి వెళ్లొచ్చు,” అనుకున్నాడు.
బ్యాగ్ భుజం మీద వేసుకొని అటువైపు నడిచాడు.కాల్వ పక్కన కొద్దిగా పొదలు ఉన్నాయి.ఎవరూ కనిపించలేదు.
అక్కడికి వెళ్లి తిరిగి వస్తుండగా వెనక నుంచి ఒక్కసారిగా గట్టిగా అరుపు వినిపించింది.
“రేయ్… ఆగు!”
సూరి వెనక్కి తిరిగాడు.
నలుగురు పోలీసులు లాఠీలు పట్టుకొని పరుగెత్తుకుంటూ వస్తున్నారు.
కొంచెం దూరంలో వాళ్ళ జీప్ నిలిచింది.
పోలీసులు అనగానే సాధారణ ప్రజానీకానికి కలిగే భయం వేసింది సూరికి. కానీ బయటకు చూపించలేదు.
“ఎవర్రా నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావ్? ఆ బ్యాగులో ఏముంది?”
“సార్… నేను ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం వచ్చాను. మా అన్న ఇక్కడే ఉండమని చెప్పి వెళ్లాడు. నేను టాయిలెట్ పొద్దామని అటు ఇటు నడుస్తూ ఇక్కడికి వచ్చాను.”
వారిలో ఒక పోలీస్ అనుమానంగా చూసాడు.
“బ్యాగ్ లో ఏముంది?” మళ్ళీ అడిగాడు.
నిజం చెప్పడానికి నోరు చాలు… కానీ నమ్మించడానికి ఆధారాలు కావాలి.
“నా ర్యాంక్ కార్డ్ అండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, సార్. కావాలంటే చూపిస్తా,” అంటూ బ్యాగ్ ఓపెన్ చేసి చూపించాడు…
సూరికి తెలీదు అందులో డబ్బు ఉన్న విషయం. ర్యాంక్ కార్డ్ డాక్యుమెంట్స్ చూపించాక సూరి చెప్పింది నిజం అని నమ్మకం కలిగాక, “ఇక్కడ ఉండకు. బెట్టింగ్ లు, తాగుబోతు ముండకొడుకులు, దొంగ నాయళ్లు ఉంటారు,” అని చెప్పి అతన్ని కూడా తీసుకొని జీప్ కాడికి నడిచినారు.
నడిచేటప్పుడు ఒక కానిస్టేబుల్ అతని బ్యాగ్ ని అనుకోకుండా పట్టి చూశాడు. అతనికేదో ఏదో అర్థం అయింది అన్నట్టు మిగతా వారికి సైగలు చేసినాడు.
“మీరు పోండిన్నా... తమ్ముడు ఫస్ట్ టైం కడపకి వచ్చినాడంట. టీ తాపించి కౌన్సెలింగ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పి వస్తా,” అని చెప్పాడు జీపు కాడికి వెళ్ళాక.
"సార్, నాకు టీ కాఫీ అలవాటులేదు. నేను వెళ్తాను," అని చెప్పి బయల్దేరబోయాడు సూరి.
“టీ వద్దులే గానీ, ఏమైనా తినిపిస్తా పా,” అంటూ బలవంతంగా అతన్ని తీసుకొని ఒక పాత ఇంట్లోకి తీసుకొని పోయాడు.
సూరికి లోపలికి వెళ్ళినాక అర్థం అయింది... అది ఇల్లు కాదు, పోలీస్ స్టేషన్ అని. అతన్ని వెనుక వైపు నుండి తీసుకొచ్చాడు.
లోపలి వెళ్ళగానే సూరి దగ్గర్నుండి బ్యాగు, ఫోన్ గుంజుకున్నాడు. “ఇప్పుడు చెప్పు తమ్ముడు... బ్యాగు లో ఎంత లెక్క ఉంది? ఈ లెక్క యాడిది? బెట్టింగ్ ఆ, లేదా హవాలా నా? మొత్తం కథ చెప్పు...కొట్టేసింది అయితే కాదనిపిస్తుందిలే,” అన్నాడు.
సూరికి అందులో డబ్బున్న సంగతే తెలియదు. ఎంత ఉన్నది... ఎక్కన్నుంచి వచ్చింది ఎలా చెప్తాడు? అన్నకి ఫోన్ చేద్దాం అనినా ఫోన్ తనకే ఇచ్చిపోయినాడు.
కౌన్సెలింగ్ కి వచ్చిన విషయం మాత్రమే తనకి తెలుసు. మిగతా ఏ విషయం అతనికి తెలీదు.
హవాలా, బెట్టింగ్ జోరుగా సాగుతున్న రోజులవి. సూరి అలాంటి ప్రదేశంలో ఎటువంటి ఆధారాలు లేకుండా పెద్ద అమౌంట్ తో పట్టుబడ్డాడు. బ్యాగ్ లో డబ్బు ఉంది, పోలీసులు పట్టుకున్నారని అర్థం అవగానే ఇంకా అంతా అయిపోయింది అని ఒళ్లంతా చెమటలు పట్టి చల్లబడిపోయాడు. ఏడుపు, బాధ, అన్న తనని ఎందుకు చెప్పలేదని ఆక్రోశం అన్ని కలుగుతున్నాయి.
తనకి తెలిసిన నిజాన్ని ఎన్ని సార్లు, ఎన్ని విధాలుగా అడిగినా అదే చెబుతున్నాడు.
ఇంతలో ముందు కలిసిన ముగ్గురు కానిస్టేబుల్స్ అక్కడికి వచ్చి, “ఏంది పరిస్థితి?” అని అడిగితే
కానిస్టేబుల్ బ్యాగ్ మళ్లీ తెరిచాడు.
డబ్బు bundle లను చూసి మిగతా పోలీసుల వైపు చూసి చిన్నగా నవ్వాడు.
“జాక్‌పాట్,” అన్నాడు.
సూరి మాత్రం ఆ నవ్వు అర్థం చేసుకోలేక గందరగోళంగా వాళ్లని చూస్తున్నాడు.
బతిమాలుతున్నట్టు చెప్తున్నాడు, “సర్, నేను చెప్పేది నిజం సర్... కౌన్సెలింగ్ కోసం వచ్చింది. అన్న పొద్దున ఒక చోటుకు తీసుకు పోయింది, బ్యాగ్ ఇచ్చి వెళ్ళింది,” చెప్తూ, “మళ్ళీ ర్యాంక్ కార్డ్ చూడండి సర్,” అని అన్నాడు.
“రేయ్... ఇంకా చాల్లే చెప్పేది అబద్ధాలన్నీ. ఈ హవాలా నాకొడుకుల బుద్ధులన్నీ మాకు తెలుసు. ఇది కొత్త నాటకం కదా, సర్టిఫికెట్లు బ్యాగులో పెట్టుకొని దొంగ నాటకాలాడడానికి...”
“సార్, నేను చెప్పేది నిజం సార్,” అని చెప్తున్నా వినకుండా వెళ్ళిపోయారు అక్కణ్ణించి…
ఇంతలో శంకర్ సెల్ కి ఫోన్ వచ్చింది. గభీక్కిన ఫోన్ తీసుకొని మెల్లిగా, ఎవరికీ వినపడకుండా మాట్లాడటం మొదలుపెట్టినాడు సూరి. రూపాయి ఫోన్ నుండి శంకర్ చేశాడు.
జరిగిన విషయం, ఎక్కడున్నదీ గబగబా చెప్పి ఫోన్ పెట్టేసాడు సూరి.
చూడనే చూశాడు ఒక కానిస్టేబుల్. “ఏం చేస్తున్నావురా?” అంటూ ఫోన్ టేబుల్ నుండి తీసుకొని చెంప మీద లాగి ఒకటిచ్చాడు.
ఒక గంట తర్వాత శంకర్ వెతుకుతూ పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చే సమయంలో…
"మేయ్... కలర్ టీవీ కావాలంటున్నావుగా, తెచ్చాలే ఈరోజు," అంటున్న మాటలు వినపడ్డాయి శంకర్ కి.
శంకర్ ని చూడగానే సూరి కళ్లెంబడి నీళ్లు వస్తున్నాయి.