
రెండు గీతలు
"పది రోజులు అయింది. ఇంకా రాలేదు. కనీసం ఆ సూచనగా వచ్చే నడుము నొప్పి, ఆ అలవాటైన బరువు కూడా లేదు. "స్ట్రెస్ వల్ల అయి ఉంటుందేమో…" తనని తనే సముదాయించుకుంది, కానీ మనసు లోపల ఏదో తెలియని అలజడి.
ఆఫీసు నుండి బయటికి వచ్చేసరికి రాత్రి 9.30 అవుతుంది.
అపోలో ఫార్మసీ దగ్గర పృథ అడుగులు ఆగిపోయాయి. వెళ్దామా, వద్దా అనే సందేహం..
చివరికి లోపలికి వెళ్లి గొంతు పెగల్చుకుని అడిగింది, "అన్నా.. ఒక టెస్ట్ కిట్.”
అతను ఆమె వైపు చూడలేదు. అతని ముఖంలో ఎలాంటి భావం లేదు. రోజూ వందల మందికి మందులు ఇచ్చే అతనికి అది కేవలం ఒక వస్తువు. కానీ పృథకి మాత్రం అది తన అరచేతిలో ఒక నిప్పుకణికలా అనిపించింది. చాలా భారంగా దాన్ని తన బ్యాగ్‌లో వేసుకుని అక్కడి నుండి నడిచింది.
ఆరోజు రాత్రి కాదు, ఏరోజు కూడా తనకి కంటి నిండా నిద్ర లేదు. తన జీవితం ఎందుకు అలా ఉందో ప్రశ్నించుకోని రోజే లేదు.
పృథకు ఊహ తెలిసినప్పటి నుండి తండ్రి అనే రూపం ఒక అస్పష్టమైన జ్ఞాపకం మాత్రమే. ఆమె ఎదుగుతున్న కొద్దీ ఆ జ్ఞాపకం మసకబారిపోయింది. ఆమె తల్లిదండ్రులు విడిపోలేదు, విడాకులు తీసుకోలేదు.దానికి కారణం ఏంటో పృథకు ఇప్పటికీ ఒక మిస్టరీనే. తన పుట్టుకే ఆ దూరాన్ని పెంచిందా? ఆ విషయం తల్లిని ఎప్పుడు అడగలేదు.
టెస్ట్ కిట్ మీద ఉన్న సూచనల్ని అప్పటికే పది సార్లు చదివింది. వెంటనే టెస్ట్ చేయాలనిపించిన మనసు మాత్రం ఇప్పుడే వద్దు అంటుంది. అలా ఆలోచిస్తూ కళ్ళు మూసుకుపోయే సమయంలో వీధిలో ఉన్న మసీదు నుండి తెల్లవారుజామున వచ్చే ఆజాన్ వినపడింది. ఒకసారిగా లేని శక్తినంతటిని కూడబెట్టుకొని బాత్రూమ్ కి వెళ్ళింది. వణుకుతున్న చేతులతో టెస్ట్ కిట్ బయటికి తీసి రెండు చుక్కలు వేసింది.
స్టిక్‌ని సింక్ అంచున పెట్టి వెనక్కి ఒక అడుగు వేసింది. అద్దంలో తననే చూస్తూ నిలబడింది. శరీరం ప్రశాంతంగా ఉంది. మనసు మాత్రం ఎక్కడో పరుగెడుతోంది.
సింక్ వైపు మళ్ళీ చూసింది. ఒక గీత కనిపించింది.
ఇంకో క్షణం. మరొక గీత మెల్లగా బయటపడింది.
ఆమె దగ్గరకు వెళ్లలేదు. దూరం నుంచే చూస్తూ నిలబడింది.
"అవి మెడికల్ రిపోర్ట్‌లు కాదు, ఎవరో పెర్మనెంట్ మార్కర్‌తో గీసినట్టున్నాయి.
పృథ వాటివంక చూస్తూ ఉండిపోయింది. బాత్‌రూమ్ లైట్ వెలుతురులో ఆ గీతలు తనని వెక్కిరిస్తున్నట్లు అనిపించాయి.
పృథ గుండెల్లో ఒక రకమైన వణుకు మొదలైంది. తన ప్రమేయం లేకుండానే కళ్ళ నుండి నీళ్ళు వస్తూనే ఉన్నాయి.. ఆ గీతలను అలానే చూస్తూ ఉండిపోయింది.
పృథ… అమ్మ, పృథ.. బాత్రూమ్ బయటనుండి అమ్మ పిలుపు.
కళ్ళు తుడుచుకొని, మొహం మీద నీళ్ళు పోసుకొని బయటకి వచ్చింది.
మళ్ళీ నిద్ర పోలేదా.. నిద్ర మాత్రాలన్నీ తిని పడుకోవచ్చుగా, రోజు ఇలా ఐతే ఎలా అంటూ.. బట్టల బుట్ట తీసుకొని లోపలికి వెళ్ళింది.
పది నిమిషాల తర్వాత..
మా.. రాధ ఇంటికి వెళ్తున్న అని చెప్పి స్కూటీ కీస్ తీసుకొని అక్కడనుంచి వెళ్ళిపోయింది.
రాధా ఇంటి కాలింగ్ బెల్ కొడుతున్నపుడు పృథ చేతులు వణుకుతున్నాయి. లోపల నుండి నిద్రమత్తులో ఉన్న రాధ తలుపు తీసింది. పృథ ముఖం చూడగానే ఏదో జరిగిందని అర్థమైంది, కానీ ఆమె అనుభవిస్తున్న బాధ తీవ్రతను ఆమె ఊహించలేదు.
రాధా ఏదో అడిగేలోపే పృథ గొంతు పెగల్చుకుని అంది, "రాధా... It's positive"
రాధా ఇంకా పూర్తిగా నిద్రలోంచి తేరుకోలేదు. కళ్ళు నలుపుకుంటూ, "ఏంటి positive? దేని గురించి మాట్లాడుతున్నావ్?" అని అయోమయంగా అడిగింది.
పృథ గొంతులో వణుకు దాచుకుంటూ, నేరుగా ఆమె కళ్లలోకి చూసి చెప్పింది, "నేను ప్రెగ్నెంట్, రాధా."
ఆ మాట వినగానే రాధా ఒక్కసారిగా నిశ్చేష్టురాలైంది.
ఆమె నిద్రమత్తు ఒక్క క్షణంలో మాయమైపోయింది. "అలా ఎలా సాధ్యం, పృథా? నువ్వు సరిగ్గా చూశావా?" అని ఆందోళనగా అడిగింది.
పృథ తన బ్యాగ్‌లో నుండి ఆ ప్లాస్టిక్ స్టిక్‌ను తీసి రాధా అరచేతిలో పెట్టింది. ఆ ఎర్రటి రెండు గీతలు ఇప్పుడు రాధాని కూడా వెక్కిరిస్తున్నట్టు ఉన్నాయి.
"నువ్వు ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉంటావు కదా... మరి ఇది ఎలా జరిగింది?" అని అడిగింది.
ఆ మాట వినగానే పృథాలో అప్పటిదాకా ఉన్న భయం కాస్తా కోపంగా మారింది. "రాధా! ఇప్పుడు మనకు రూట్ కాజ్ అనాలిసిస్ (Root Cause Analysis) అవసరమా? అది ఎలానో జరిగిపోయింది.. ఇప్పుడు చర్చించాల్సింది గతం గురించి కాదు, భవిష్యత్తు గురించి!" అని గట్టిగా అరిచింది.
రాధా కొంచెం తగ్గింది, కానీ మరుక్షణమే అసలు ప్రశ్న వేసింది. "సరే... మరి ఆంటీకి తెలుసా?" " "తెలియదు. తెలిస్తే ఏమౌతుందో కూడా నాకు తెలియదు," అని తల దించుకుంది పృథ.
"అయితే ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావ్? ఏదైనా నిర్ణయం తీసుకున్నావా?" అని రాధా ఆత్రుతగా అడిగింది.
రాధా అడుగుతున్న ప్రశ్నలు పృథాకి పరిష్కారంలా కాకుండా శిక్షలా అనిపించాయి. "నాకు ఏమీ అర్థం కాక, ఏదైనా సలహా ఇస్తావని నీ దగ్గరికి వస్తే... నువ్వు కూడా అర్థం పర్థం లేని ప్రశ్నలతో నన్ను విసిగిస్తున్నావ్." అని అరుస్తూ, కోపంగా కన్నీళ్లతో అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది.
స్కూటీ ఆపి, గేట్ తీసి లోపలి ఎలా వెళ్లిందో కూడా పృథకి గుర్తు లేదు. ఇంట్లోకి వచ్చేసరికి అన్నీ మామూలుగానే ఉన్నాయి.
లైట్… ఫ్యాన్… గోడలు…
నేరుగా గదిలోకి వెళ్లి పడుకుంది. కిటికీ బయట ఆకాశం కనిపిస్తోంది. కానీ ఆమె చూపు ఎక్కడో ఉంది.. చేయి మెల్లిగా కడుపు పైకి వెళ్ళింది.
ఒక్కసారిగా వెనక్కి తీసుకుంది, ఏదో తాకరానిది తాకినట్టుగా.
ఫోన్ స్క్రీన్ ఒక్కసారిగా వెలిగింది.
మెసేజ్ ఫ్రొం రాధ.. మెసేజ్ ఓపెన్ చేసింది.
"నేను విధుర మేడమ్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నా, 10.30 కి వస్తాను రెడీగా ఉండు"
చెప్పినట్టుగా 10.30 కి రాధా వచ్చింది.. రాధ డ్రైవ్ చేస్తోంది. పృథ వెనుక కూర్చుంది.
సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు, పక్కన ఒక చిన్న పిల్లాడు నవ్వుతూ పరిగెత్తాడు. పృథ చూపు అతనిపై పడింది.
ఒక్క సెకండ్.
చాలు.
మళ్లీ తల తిప్పుకుంది.
రాధ రియర్ వ్యూ మిర్రర్‌లో చూసింది, కానీ ఏమీ చెప్పలేదు.
హాస్పిటల్ లోపలకి అడుగుపెట్టగానే ఒక చల్లని వాసన.. పృథ కుర్చీ అంచున కూర్చుంది. చేతులు గట్టిగా పట్టుకుంది. బొటనవేళ్లు ఒకదానికొకటి రుద్దుకుంటూనే ఉన్నాయి. పక్కనే రాధ కూర్చుంది.
“విధురా మేడమ్ పిలుస్తున్నారు…”
నర్స్ తలుపు కొద్దిగా తెరిచి చెప్పింది. లోపల రూమ్ చాలా క్లీన్‌గా ఉంది. ఫైల్స్ సరిగ్గా అమర్చబడి ఉన్నాయి. టేబుల్ మీద ఎటువంటి అల్లకల్లోలం లేదు.
పృథ మనసు మాత్రం దానికి వ్యతరేకంగా ఉంది.
విదుర తలెత్తి చూసింది.
ముందు రాధ వైపు ఒక చూపు—అది ముందుగా పరిచయం ఉన్న చూపు.
తర్వాత పృథ వైపు—కొంచెం ఎక్కువ సేపు.
“కూర్చోండి.”
ఇద్దరూ కూర్చున్నారు.
విధుర వెంటనే ప్రశ్నలు అడగలేదు. కాసేపు వాళ్లిద్దరినీ గమనించింది.
పృథ కళ్ళు తిప్పుకుంది.
రాధా చెప్పడం మొదలు పెట్టింది, "మేడం తిను నా ఫ్రెండ్ పృథ. ఈరోజు మార్నింగ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది."
“సరే.”
రాధ ఆగలేకపోయింది.
“మేడమ్… ఆమె పరిస్థితి కొంచెం కాంప్లికేటెడ్. తనకింకా పెళ్లి కాలేదు. వాళ్ళమ్మతో మాత్రమే ఉంటుంది."
ఆగమన్నట్టు చేయి చూపించి, "కొన్ని సార్లు టెస్ట్ కిట్స్ రాంగ్ గ చూపిస్తుంది, కన్ఫర్మేషన్ కోసం బ్లడ్ ప్రెగ్నన్సీ టెస్ట్ రాసాను, రిజల్ట్స్ వచ్చాక మాట్లాడుదాం" అంది డాక్టర్.
బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ పట్టుకుని నర్స్ బయటికి వచ్చింది. రాధాని చూడగానే ముఖంలో చిరునవ్వుతో, "కంగ్రాచులేషన్స్ అక్కా! రిపోర్ట్ పాజిటివ్. మీరు ప్రెగ్నెంట్!" అని ఉత్సాహంగా చెప్పింది.
రాధా ముఖంలో ఎలాంటి భావం లేదు. "ఇది నా రిపోర్ట్ కాదు" అని నర్సుతో చెప్పి, రిపోర్ట్ తీసుకొని నేరుగా విదుర మేడమ్ గదిలోకి వెళ్ళారిద్దరు.
రిపోర్ట్ చూసిన విదుర కాసేపు మౌనంగా ఉండిపోయింది.
విదుర గొంతు సవరించుకుని ఇలా అంది, "పృథా... నీ వయస్సు 38. ఈ ఏజ్ లో, నువ్వు చేస్తున్న వర్క్ ప్రెషర్‌లో నాచురల్‌గా కన్సీవ్ అవ్వడం అనేది చాలా అరుదు. ఒక డాక్టర్‌గా, నీ హెల్త్ కండిషన్ చూసి నేను చెప్పేది ఒక్కటే: నేను నీ ప్లేస్‌లో ఉంటే మాత్రం ఈ ప్రెగ్నెన్సీని అబార్ట్ చేయను. I won't recommend an abortion."
పృథా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె లోపల ఏదో తెలియని ఆగ్రహం తన్నుకొచ్చింది. "నేను ఇక్కడికి అబార్షన్ కోసం రాలేదు, మేడమ్!" అని కటువుగా అనేసింది. రాధా వెంటనే కల్పించుకుంది, "నువ్వు ఆగు, పృథా! మేడమ్... తనకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, ఈ సొసైటీలో తను ఈ బిడ్డతో ఎలా బతకగలదు?"
విదుర చాలా ప్రశాంతంగా సమాధానమిచ్చారు, "సొసైటీ గురించి ఆలోచించడం పక్కన పెట్టండి, రాధా. నేను పృథా ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాను. ఈ వయస్సులో అబార్షన్ చేసుకుంటే, మళ్ళీ తను తల్లి అయ్యే అవకాశం దాదాపు జీరో. అయినా, తన బాడీ ఈ ప్రెగ్నెన్సీని కోరుకుంటోంది ఏమో.
నిర్ణయం మీదే... మీకు కంటిన్యూ చేయడం ఇష్టం లేకపోతే ప్రాసెస్ చెప్తాను."
రాధా పృథ వైపు చూసింది. పృథ చూపులు శూన్యంలో ఉన్నాయి. రాధా మెల్లిగా అడిగింది, "సరే, మేడమ్... ఒకవేళ అబార్షన్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి?"
ఆ ప్రశ్న అడగేటపుడు రాధ పడిన బాధ వర్ణనాతీతం, ఎందుకంటే పిల్లలు కావాలని తాను కలవని డాక్టర్ లేదు.. తిరగని గుడి లేదు, మొక్కని దేవుడు లేదు.
"ఇంకా ఎర్లీ స్టేజ్ కాబట్టి సర్జరీ అక్కర్లేదు. కొన్ని టాబ్లెట్స్ ఇస్తాను. అవి వాడితే సరిపోతుంది. కానీ మూడు రోజులు కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి. వారం తర్వాత నార్మల్ పనులు చేసుకోవచ్చు," అని విదుర ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చారు.
హాస్పిటల్ బయట ఉన్న ఫార్మసీలో మెడిసిన్ కొని పృథ బ్యాగులో పెట్టింది రాధ.
రాధ, పృథని ఇంటి దగ్గర దించి వెళ్ళబోతుంటే, అప్పటికే కంగారుగా తలుపు దగ్గర నిలబడి ఉన్న తల్లి ఎదురుపడింది. "ఏమైంది, పృథా? పొద్దున్నుంచి ఫోన్ లేదు, ఆఫీసుకి వెళ్ళలేదు... ఏమైంది అసలు?" అని నిలదీసింది.
రాధా ఏదో చెప్పబోతుంటే, పృథ వెంటనే అడ్డుపడి, "రాధా, నీకు లేట్ అవుతోంది, నువ్వు వెళ్ళు. నేను అమ్మకి విషయం చెప్తాను," అని రాధాని పంపేసింది.
ఇంట్లోకి వెళ్ళాక, ఆ హాల్‌లోని నిశ్శబ్దాన్ని చీలుస్తూ పృథ నేరుగా అమ్మ కళ్ళలోకి చూసి చెప్పింది, "అమ్మా... నేను ప్రెగ్నెంట్."
ఆ మాట వినగానే తల్లి ప్రపంచం ఒక్క క్షణం ఆగిపోయింది. ఆమె ఏడవలేదు, కేకలు వేయలేదు. వెంటనే "నీకు తెలుసు కదా, రాధాకి పిల్లలు పుట్టడం లేదని తను IVF చేయించుకుంటోంది. కేవలం ఒక ఎక్స్‌పెరిమెంట్‌గా, తనకి తోడుగా నేను కూడా చేయించుకున్నాను. తనకి ఫెయిల్ అయింది... నాది సక్సెస్ అయింది. హాస్పిటల్ దగ్గర్నుండి వస్తున్నాం" అని చెప్పింది.
పృథా చెప్తున్నది పచ్చి అబద్ధమని తల్లికి అర్థమైంది.
IVF అంటే ఆట కాదు, తన కూతురు తనని నమ్మించాలనిచూడటం చూసి ఆమె మనసు వికలమైపోయింది. కానీ ఆమె పృథాని నిలదీయలేదు. ఎందుకంటే, ఆ తల్లి మనసులో తాను చేసిన తప్పు గురించి నేరభావం మొదలయ్యింది.
పృథకు తెలియని ఆ చేదు నిజం తల్లి కళ్లముందు కదలాడింది. పృథా చిన్నప్పుడు, తన తండ్రి ఆమెను తాకకూడని చోట తాకుతూ ఉండటం, అసభ్యంగా ప్రవర్తించడం ఆమె కళ్లతో చూసింది. గొడవ చేస్తే పరువు పోతుందనో, సమాజం ఎలా చూస్తుందనో, ఏమి చెప్పకుండా పృథాని తీసుకుని ఆ ఇంటి నుండి బయటకు వచ్చేసింది.
అప్పటినుండి మగవాడంటేనే ఒక అసహ్యం పెంచుకున్న ఆ తల్లి, పృథాని ఏ మగాడు తాకకూడదని, తన కూతురికి ఆ గతి పట్టకూడదని ఇన్నేళ్లుగా వస్తున్న ప్రతి పెళ్లి సంబంధాన్ని ఏదో ఒక సాకుతో క్యాన్సిల్ చేస్తూ వచ్చింది.
"నేను నా కూతురి భవిష్యత్తును కాపాడుతున్నాను అనుకున్నాను, కానీ నేనే తనని ఈ స్థితికి తెచ్చానా? నేను పెళ్లి చేసి ఉంటే ఈరోజు తను గౌరవంగా ఉండేది కదా..." అని తనలో తనే కృశించిపోవడం మొదలుపెట్టింది.
పృథ నిలబడి సమాధానం కోసం చూస్తోంది. తల్లి మాత్రం ఆ కిటికీ అవతల ఉన్న చీకటిని చూస్తూ ఉండిపోయింది.
పృథ పిలుపు తల్లిని ఈ లోకంలోకి తెచ్చింది. "అమ్మా... ఏం చేయమంటావు?" అని పృథా అడిగింది.
కానీ తల్లి ముఖంలో ఎలాంటి కదలిక లేదు. ఆమె కళ్లు ఇంకా బయట చీకటినే చూస్తున్నాయి. చాలా నిశ్చలంగా, కేవలం ఒక మాట చెప్పింది: "తీసేయించుకో."
ఆ మాట వినగానే పృథా గుండె పగిలినట్టు అయింది. ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చింది. కానీ తల్లి ఆమెను దగ్గరకు తీసుకోలేదు, ఓదార్చలేదు. కూతురి ఏడుపు కంటే, తన గతం చేసిన గాయం ఆమెను ఎక్కువగా బాధిస్తోంది. తన నేరభావం ముందు కూతురి కన్నీళ్లు కూడా చిన్నవిగా అనిపించాయి.
కొన్ని గంటల నిశ్శబ్దం తర్వాత... పృథా మళ్ళీ తల్లి దగ్గరకు వెళ్ళింది. ఈసారి ఆమె కళ్లలో నీళ్లు లేవు. "అమ్మా... ఇపుడు నాకు 38 ఏళ్లు. నాకు పెళ్లి సంబంధాలు రావు, పెళ్లి చేసుకొనే ఉద్దేశం కూడా లేదిప్పుడు. నువ్వు నా పక్కన ఉన్నావు, సరే... కానీ రేపు నువ్వు లేని రోజు నా పరిస్థితి ఏంటి? నేను బతకడానికి ఒక కారణం ఉండాలి కదా, అమ్మా?" అని సముదాయిస్తూ చెప్పింది.
పృథా మాటలు తల్లిని ఆలోచనలో పడేశాయి. ఆమెకు తెలుసు, పృథాని ఈ స్థితిలోకి తెచ్చింది తన అతి జాగ్రత్తేనని. ఆ నేరభావం ఆమెను బలహీనపరిచింది. ఆమె మెల్లిగా తల ఊపింది. "నీ ఇష్టం... నీకు ఇది సరైనది అనిపిస్తే అలాగే చెయ్. నేను అడ్డు చెప్పను," అని చెప్పి, పడుకోవడానికి గదిలోకి వెళ్ళిపోయింది.
మరుసటి రోజు ఉదయం పృథ ఆఫీసుకి వెళ్ళింది. పృథ తన పనిలో మునిగిపోయి ఉండగా, స్క్రీన్ మీద ఒక ఇమెయిల్ పాప్-అప్ అయింది: "Sweets at my desk!"
పక్కన ఉన్న కొలీగ్ ఉత్సాహంగా, "పద, పృథా! స్వీట్స్ తెచ్చుకుందాం" అని పిలిచింది. ఇద్దరూ వెళ్ళారు.
"ఏంటి విశేషం? ఎందుకు ఈ స్వీట్స్?" అని అడిగినప్పుడు, ఆ తోటి ఉద్యోగిని ముఖం వెలిగిపోతూ చెప్పింది, "నేను అమ్మనవుతున్నాను."
ఆమె కళ్లలోని ఆనందం, చుట్టూ ఉన్నవారు చెప్తున్న 'కంగ్రాచులేషన్స్'... అన్నీ చూస్తుంటే పృథకి తన పరిస్థితి గుర్తొచ్చింది. తను కూడా అదే స్థితిలో ఉంది, కానీ తన ఆనందం పంచుకోవడానికి ధైర్యం లేదు. అందరు తనని జడ్జ్ చేస్తారు.
తన నిర్ణయాన్ని సమర్ధించే వాళ్ళు ఒక్కరు కూడా లేదనే బాధ చెద పురుగులా తొలిచేస్తోంది. చివరికి, తను ఎవరికైతే ఈ విషయం చెప్పకూడదు అనుకుందో, ఆ వ్యక్తికే ఫోన్ చేసింది. అతను ఈ పరిస్థితికి బాధ్యుడే కావచ్చు, కానీ వారి మధ్య బంధం కేవలం పరస్పర అంగీకారం మాత్రమే. పెళ్లి అనే ఆలోచనే అక్కడ లేదు.
"నేను ప్రెగ్నెంట్," అని పృథ చెప్పగానే, అవతలి వైపు నుండి వెంటనే వచ్చిన మాట, "డాక్టర్‌ని కలిశావా? ... అబార్షన్.."
అతను పూర్తి చేసేలోపే పృథ ఫోన్ కట్ చేసేసింది. ఆ జవాబు ఆమెకు ముందే తెలుసు.
సాయంత్రం ఇంటికి చేరుకోగానే, అపార్ట్‌మెంట్ కింద ఒక పెద్ద గొడవ వినిపించింది. ఒక ముసలాయన తన కొడుకు, కోడలిపై అరుస్తున్నాడు.
"బాబు ని వదిలేసి బాధపెట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? మీ గొడవల మధ్య వాడిని బలి చేస్తారా?" అని గట్టిగా అరుస్తున్నాడు.
ఆ దృశ్యం పృథాని ఆలోచనల్లో పడేసింది.
"నేను ఈ బిడ్డకు జన్మనిస్తే, వాడు కూడా ఇలాగే సఫర్ అవుతాడా?"
"నాకు తండ్రి ప్రేమ లేదు, ఇప్పుడు నా బిడ్డకు కూడా అదే పరిస్థితిని నేను గిఫ్ట్‌గా ఇస్తున్నానా?"
"ఒక ప్రాణాన్ని తీయడం పాపం అని ఎవరికీ అనిపించడం లేదెందుకు?"
"... కానీ ఆ ప్రాణం పుట్టిన తర్వాత పడే నరకం గురించి ఆలోచిస్తే.."
పృథ తల పగిలిపోతుంది.
పృథ మెల్లిగా మెట్లు ఎక్కి ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుంది.. పృథ తన హ్యాండ్‌బ్యాగ్ తెరిచింది.