రికార్డింగ్ మైక్ స్టాండ్ ఒక అంగుళం ఎక్కువ ఎత్తులో ఉంది. నా గొంతు లెవల్‌కి కాదు, ఎవరిదో పొడుగు సింగర్ కోసం సెట్ చేసినట్టు ఉంది. సరిచేసుకోబోయి, వద్దులే అనుకున్నాను. కొంచెం బిగ్గరగా పాడితే సరిపోతుంది.
స్టూడియో లో ఏసీ శబ్దం తప్ప ఇంకేమీ లేదు. గాజు అవతల సౌండ్ ఇంజినీర్ కంప్యూటర్ ముందు కూర్చుని ఏదో క్లిక్ చేస్తున్నాడు, ఒకసారి గడియారం వైపు చూసాడు. అతని ముఖంలో ఏ ఉత్సాహం లేదు.. ఇది అతనికి రోజూ చేసే పని, ఇరవై మందిలో ఇరవై ఒకటో మనిషిని రికార్డ్ చేయడం.
నేను అద్దంలో చూసుకున్నట్టు నా మొహాన్ని ఒకసారి చెక్ చేసుకున్నాను నవ్వు కాదు, టెన్షన్ కాదు, "రెడీగా ఉన్నవాడి మొహం" అని ఎలా కనిపిస్తుందో అలా. ఇది నేను ఎప్పటినుండో చేస్తున్న పని. ఎవరైనా నా వైపు చూసినపుడు వాళ్లకి ఏం కనిపించాలో, అది ముందే సెట్ చేసుకోవడం. లోపల ఏముందో దానికి, బయట కనిపించేదానికి మధ్య సంబంధం ఉండక్కర్లేదని ఎప్పుడో నేర్చుకున్నాను.
"సార్... రెడీ."
హెడ్‌ఫోన్స్ తీసుకుని చెవుల మీద పెట్టుకున్నాను. గాజు అవతల ఉన్న ఇంజినీర్ నా వైపు చూడలేదు, కీబోర్డ్ మీద వేళ్ళు కదిపాడు, రికార్డ్ బటన్ నొక్కేశాడు. ఎర్ర లైట్ వెలిగింది.
"టేక్ వన్."
గదిలో మళ్లీ నిశ్శబ్దం. ఈ నిశ్శబ్దంలో ఒక క్షణం .. పాట మొదలవ్వక ముందు, ఏమీ జరగని ఆ సెకను అదొక్కటే నాకు నిజంగా నాదిలా అనిపిస్తుంది. ఎందుకంటే అందులో ఏమీ perform చేయాల్సిన అవసరం లేదు.
ట్రాక్ మొదలైంది.
ఈ రోజు నా మొదటి ఆల్బమ్ రికార్డింగ్. కనీసం అలా అనుకోవాలి నేను.
నాకు ఐదేళ్లున్నపుడు అంట, హాల్లో అందరూ ఉండగా, టీవీ మ్యూజికల్ ప్రోగ్రామ్‌లో వస్తున్న పాటని నేను గొణుక్కుంటూ పాడుతున్నానని పెద్దమ్మ గమనించింది. టీవీ వాల్యూమ్ తగ్గించి, "ఒరేయ్, ఏం పాడుతున్నావ్‌రా?" అని అడిగింది.
నాకు తెలియదు పాట పేరు. టీవీలో ఏం వినిపిస్తే అదే మళ్ళీ పాడాను అంట, అంతే. ఐదేళ్ల పిల్లాడికి "నాకు తెలియదు" చెప్పడం చేతకాదు కదా, అందుకని నేను మళ్ళీ అదే పాడి ఉండొచ్చు, జవాబుగా.
"వీడికి సంగీతం అంటే ఇష్టం అన్నట్టుంది, చూడండి ఎంత బాగా పాడుతున్నాడో" అంది పెద్దమ్మ, అందరి వైపు తిరిగి.
నిజంగా ఆమెకి అలా అనిపించిందా, నా మీద ప్రేమతో మురిసిపోయి అలా అన్నదో తెలీదు. కానీ ఇంట్లో అందరూ దాన్ని ఒక నిర్ణయంగా తీసుకున్నారు. పెద్దనాన్న కుర్చీలో వెనక్కి వాలి ఇలా అన్నారట: "మన ఇంట్లో అందరం ఒకటే చదివాం, ఇంజినీరింగ్ చేశాం, ఉద్యోగాలు చేస్తున్నాం, కానీ మనలో ఎంతమందికి నిజంగా అదే చేయాలనిపించింది!"
ఒక్క క్షణం నిశ్శబ్దం. బాబాయి నవ్వి, "నిజం చెప్పాలంటే... నాకు అప్పట్లో క్రికెట్ ఆడాలని ఉండేది."
నాన్న చిరునవ్వు నవ్వి, "నాకూ అంత తేడా లేదు, కానీ పరిస్థితులు నీకే తెలుసు." ఆయన మొహంలో ఆ నవ్వు రెండు సెకన్లు ఎక్కువసేపు నిలిచింది. నిజంగా నవ్వినపుడు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ సేపు. నేను అప్పుడు గమనించలేదు. ఇప్పుడు గుర్తొస్తే అనిపిస్తుంది, ఆయన కూడా ఏదో ఒక మొహాన్ని పట్టుకుని కూర్చున్నారని, అది ఆయనది కాదని.
పెద్దమ్మ వెంటనే నా వైపు చూసి, "అందుకే వీడిని మనలా చేయొద్దు, వీడికి సంగీతం అంటే ఇష్టం, అదే నేర్పిద్దాం" అంది.
ఎవరూ నన్ను అడగలేదు, నాకు నిజంగా ఏం ఇష్టమో. బహుశా అడిగినా నేను చెప్పలేకపోయుండేవాడిని. ఐదేళ్ల వాడికి "ఇష్టం" అంటే ఏంటో ఎలా తెలుస్తుంది.
మర్నాడే క్లాసికల్ మ్యూజిక్ మొదలుపెట్టించారు. నాకింకా గుర్తుంది, ఇన్‌స్టిట్యూట్ బయటకి వస్తున్న హార్మోనియం సౌండ్.
తర్వాత కొన్ని సంవత్సరాలు వేగంగా గడిచిపోయాయి. స్కూల్ సిలబస్ కన్నా మ్యూజిక్ గురించే ఎక్కువ డిస్కషన్స్ అవుతుండేవి ఇంట్లో. ప్రతి ఏడు స్కూల్ ఫంక్షన్ లో, వినాయకచవితి సంబరాలలో నా చేత పాడిస్తుండేవాళ్లు. చిన్నప్పటినుండి నేర్చుకోవడం వల్లనో ఏమో, నేను పాడినపుడల్లా చప్పట్లు మోగేవి. చప్పట్లు వినడం అలవాటైపోయింది. చప్పట్లు వస్తే ఇంట్లో వాళ్లు సంతోషించేవాళ్లు.
నేను కూడా నవ్వేవాడిని.
అది ఎందుకో నాకు తెలియదు. బహుశా వాళ్లు సంతోషంగా ఉంటే నేను కూడా నవ్వడం నేర్చుకున్నానేమో.
స్కూల్ అయ్యాక అందరు ఇంజినీరింగ్ జాయిన్ అవుతుంటే, మా ఇంట్లో "వద్దు, మ్యూజిక్ సైడ్ ఉంచాలి" అనుకున్నారు. ఆ సమయంలో నేను ఏం చేయాలనుకుంటున్నానో ఎవరూ అడగలేదు. అది అవసరం అనిపించలేదు, ఎందుకంటే వాళ్లకి సమాధానం అప్పటికే తెలుసు:
నేను సంగీతం నేర్చుకుంటున్నాను. అందుకే నాకు సంగీతమే ఇష్టం. సంగీతం ఇష్టం. అందుకే దాన్నే కెరీర్‌గా తీసుకోవాలి.
ఈ రెండు వాక్యాల మధ్య ఉన్న ఖాళీని ఎవ్వరూ గమనించలేదు.
ఇండియాలో టాప్ మ్యూజిక్ కాలేజీల కోసం వెతకడం మొదలెట్టారు. ఆ నిర్ణయం తీసుకోడంలో కొంచెం లేట్ అయి ఒక సంవత్సరం ఇంట్లో కూచోవాల్సి వచ్చింది. ఆ సంవత్సరం నేను ప్రతిరోజూ ప్రాక్టీస్ చేశాను, ఎవరూ చెప్పకపోయినా. కానీ అది నాకు సంగీతం అంటే ఇష్టం కాబట్టి చేశానా, లేక ఒక సంవత్సరం వృథా అయిపోతోందని ఇంట్లో అందరూ అనుకోవద్దని చేశానా అనేది అప్పట్లో నాకు తెలియదు. ఇప్పటికీ తెలియదు.
ఒక రోజు నాన్న తన ఫ్రెండ్ ద్వారా దేశంలోనే మంచి మ్యూజిక్ కాలేజీలో అడ్మిషన్స్ జరుగుతున్నాయని చెప్పాడు. రిఫరెన్స్ కూడా దొరికిందట.
ఆడిషన్ రోజునే అక్క పెళ్లి నిశ్చయమైంది. ఇంట్లో కొంత గందరగోళం.
"ఆడిషన్ ముఖ్యం, నువ్వు వెళ్ళు, ఇక్కడ మేము చూసుకుంటాం" అని అమ్మ చెప్పింది, ప్లేటులో అన్నం కలుపుతూ, నా వైపు చూడకుండానే. నాన్న తలూపారు, ఏదో ఖాయం చేసినట్టు.
నాకు నిజంగా అక్క పెళ్లి మిస్ అవుతున్నాననే బాధ కూడా లేదు, ఆడిషన్‌కి వెళ్తున్నాననే ఉత్సాహం కూడా లేదు. కానీ వీళ్లందరూ ఇలా చెప్పడం చూస్తుంటే, అక్క పెళ్ళికి నేను ఉండలేనని నేను బాధ పడాలేమో అనిపించింది. వాళ్లు ఏదో ముఖ్యమైన విషయం చెబుతున్నారు కాబట్టి నేను కూడా దాన్ని ముఖ్యమైన విషయంలా తీసుకున్నాను. అంతే.
బయల్దేరే సమయంలో నేను కూడా వస్తున్నాను అని అన్నారు నాన్న. నేను ఆపలేదు — ఆయన ఇష్టం కదా అనిపించింది.
బస్సులో కూర్చుని, కిటికీ బయటికి చూస్తుంటే, ఆయన మధ్య మధ్యలో నా భుజం మీద చెయ్యి వేసి, "టెన్షన్ పడకు, ఈ ఇయర్ రాకపోతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ట్రై చేద్దాం" అన్నారు. ఆ మాట ఆయన నాకోసమే అంటున్నారో, తనని తాను శాంతపరుచుకోడానికి అంటున్నారో నాకు తేడా తెలియలేదు.
ఆడిషన్ రోజు, కాలేజీ ఆడిటోరియం దగ్గర చాలా రష్‌గా ఉంది. ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని అందరూ రిహార్సల్ చేసుకుంటున్నారు. కొంతమంది కళ్లు మూసుకుని పాడుతున్నారు, కొంతమంది తమతో వచ్చిన వాళ్లతో స్వరాల గురించి మాట్లాడుతున్నారు.
ఒక అబ్బాయి తన తండ్రితో గొడవపడుతున్నాడు.
"నాకు ఈ పాట వద్దు. ఇంకోటి పాడతాను."
వాళ్ల తండ్రి, "ఇదే నీకు బాగా వస్తుంది" అంటున్నాడు.
అందరిలో ఏదో ఆత్రుత కనిపించింది, ఏదో పోగొట్టుకోకూడని దానికోసం పోరాడుతున్నట్టు. నేను వాళ్ళని చూస్తూ నిలబడ్డాను, నాకు అలాంటిది ఏమీ లేకపోవడం గురించి ఆలోచించకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ.
నాన్న నా పక్కనే అటూ ఇటూ తిరుగుతూ, మధ్య మధ్యలో వచ్చి "నువ్ ఏం టెన్షన్ పడకు, నువ్వు 100% ఎఫర్ట్ పెట్టు, సీట్ రావడం లేదా అనేది తర్వాత చూద్దాం" అనేవారు. నేను "ఆఁ" అని చెప్పి నోటీసు బోర్డు, చుట్టుపక్కల పరిసరాలని గమనిస్తున్నాను. అదే టైమ్‌కి ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో అక్క తలంబ్రాలు పోసుకుంటోంది. అప్పుడు నాకేమనిపించిందో గుర్తు లేదు. బహుశా ఏమీ అనిపించలేదు.
కాసేపటికి నా పేరు పిలిచారు. చేతిలో బాగ్ నాన్న చేతికిచ్చి లోపలికి వెళ్ళాను. నలుగురు ప్రొఫెసర్స్ కూర్చుని ఉన్నారు. నమస్కారం చేసి మైక్ ముందు నిలబడ్డాను. ఇద్దరు ప్రొఫెసర్స్ నా వైపు చూడకుండా పేపర్ మీద ఏదో రాసుకుంటున్నారు, ఒకతను "నీకు ఇష్టమైన పాట పాడు" అన్నారు.
"నీకు ఇష్టమైన పాట." అలా అని ఏమైనా ఉందా నాకు అనుకుంటూ రెండు క్షణాలు ఆలోచించాను. ఇష్టం అంటే ఏంటో నాకు ఎప్పుడూ సరిగ్గా తెలియదు, ఎందుకంటే ఇష్టం తెలియాలంటే దానికి పక్కన ఏదో నచ్చకపోవడం ఉండాలి, పోల్చుకోడానికి. నాకు అలాంటి పోలిక దొరకలేదు. నేను ఏదీ అంతగా వద్దనుకోలేదు, ఏదీ అంతగా కావాలనుకోలేదు. అందుకే "ఇష్టమైనది" అని ఏదీ లేదు నాకు, ఉన్నదల్లా "నేర్చుకున్నది" మాత్రమే.
"ఏదైనా పాడొచ్చా?" అని అడిగి, భైరవి రాగం మొదలుపెట్టాను. ఇష్టం వల్ల కాదు, అదే బాగా వచ్చు కాబట్టి.
అందరు ఒక్కసారిగా నా వైపు చూశారు. పాడటం అయ్యాక కొన్ని స్వరాల గురించి అడిగారు, సమాధానం ఇచ్చాను. "ఎన్ని సంవత్సరాలుగా నేర్చుకుంటున్నావ్?" అని అడిగారు. ఐదేళ్లప్పుడు మొదలుపెట్టానని చెప్పాను.
"మీ ఫ్యామిలీలో ఎవరైనా గాయకులు ఉన్నారా?"
"లేదు."
కొంతసేపు వాళ్లు ఒకరినొకరు చూసుకున్నారు. తర్వాత ఒకరు నవ్వుతూ, "నీకు మ్యూజిక్ నాలెడ్జ్ ఉంది, బాగా పాడుతున్నావ్, మాకు నీలాంటి స్టూడెంట్స్ కావాలి" అని అడ్మిషన్ ఇచ్చారు.
నేను లెటర్ తీసుకుని మామూలుగా బయటికి వచ్చాను. నాన్న దూరం నుంచే నన్ను చూశారు. సీట్ రాలేదేమో అనుకుని, "ఏం పర్లేదు నాన్నా, ఇంకో ఏడాది బాగా ప్రాక్టీస్ చేయి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ట్రై చేద్దాం" అని చెప్తుంటే, నేను సీట్ వచ్చిన విషయం వెంటనే చెప్పలేదు. ఒక క్షణం ఆయన మొహంలో ముందే సిద్ధం చేసుకున్న ఓదార్పు కనిపించింది, అది కూడా ఆయన ప్రాక్టీస్ చేసిన మొహమే అనిపించింది నాకు. తర్వాత చెప్పాను.
"నాకు తెలుసు రా నీ గురించి" అంటూ అందరికి చెప్పాలంటూ ఫోన్ చేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు.
పెళ్ళయ్యాక అక్క రెండో రోజే ఫోన్ చేసింది. "నా పెళ్లి చూడలేదని బాధపడకు, నీ మొదటి రికార్డింగ్ నేను చేయిస్తా, నా సొంత డబ్బుతో." ఆమె గొంతులో ఏదో ఉత్సాహం ఉంది. అది ఎక్కడ నుండి వస్తుందో నాకు తెలుసు .. భర్త సంపాదన. తను పెళ్ళికి ముందే జాబ్ చేయడం మానేసింది. కానీ ఆ డబ్బుని తన డబ్బుగానే భావిస్తుంది, ఎవరితోనూ వేరేలా చెప్పదు బహుశా తనకే తెలియదేమో అది తనది కాదని.
కానీ ఆ విషయం ఆమెతో మాట్లాడాల్సిన అవసరం నాకు అనిపించలేదు.
నేను ఫోన్‌లో ఏమీ అనలేదు. "సరే అక్కా" అన్నాను, ఇంకో ఆప్షన్ ఏముంది అన్నట్టు.
కాలేజీ ఫైనల్ ఇయర్‌లో ఉన్నపుడు, అవకాశాల కోసం ట్రై చేయాలని ముంబై పంపించారు నన్ను. ఫుడ్ విషయంలో ఇబ్బంది పడతానేమోనని అమ్మ కూడా నాతో వచ్చింది.
ఒక మధ్యాహ్నం పడుకుని ఉంటే లేపి, "నాన్నా, మనం ఇంటికి వెళ్తున్నాం, బయల్దేరు" అంది. టికెట్స్ ఉన్నాయా అని కూడా నేను అడగలేదు, అమ్మే ఎలానో ఏర్పాటు చేసినట్టుంది. ట్రైన్ ఎక్కాక "నీకు ఒక సర్‌ప్రైజ్ ఉంది నాన్నా" అంది.
ఇంటికి వెళ్ళాక అమ్మ చెప్పింది నా కోసం అక్క UK నుండి వచ్చిందని, నా మొదటి ఆల్బమ్ తనే చేయిస్తుందని, రికార్డింగ్ కోసం ఏర్పాట్లన్నీ అప్పటికే చేసేసిందని. "నాకు చాలా హ్యాపీగా ఉంది నాన్నా" అంది.
ఇంటికి వెళ్ళగానే అక్క నన్ను కౌగలించుకుని, "నేను చిన్నప్పటి నా కలను నేను పూర్తిచేస్తున్నాను" అంది.
మైక్ ముందు ఇప్పుడు నేను నిలబడి ఉన్నాను. మొదటి టేక్ అయిపోయింది. అక్క వైపు చూశాను, ఆమె ఫోన్‌లో ఎవరికో మెసేజ్ చేస్తోంది. బహుశా తన భర్తకి. "మొదలైంది" అని రాసి ఉండొచ్చు.
హెడ్‌ఫోన్స్‌లో ఇంజినీర్ గొంతు వినిపించింది "సార్, ఒకసారి ఇంకో టేక్ చేద్దాం, రెండో లైన్ దగ్గర కొంచెం లేటయ్యింది." ఏ మెచ్చుకోలు లేదు, ఏ విమర్శా లేదు. కేవలం టెక్నికల్ నోట్.
నేను తలూపాను.
అతను ప్లేబ్యాక్ పెట్టాడు. నా గొంతు స్పీకర్లలోంచి వినిపించింది. నేను విన్నాను. అది బాగానే ఉంది.
కానీ ఇంజినీర్ ఏదో చోట వేలితో చూపించాడు. "ఇక్కడ కొంచెం ఎమోషన్ కావాలి సార్."
నేను అతని వైపు చూశాను. "ఎక్కడ?"
అతను పాటలో ఒక లైన్ చూపించాడు. "ఇక్కడ."
మళ్లీ పాడాను. ఈసారి అతను సంతృప్తిగా తల ఊపాడు.
రికార్డింగ్ స్టూడియో నుండి బయటికి రాగానే అక్క నన్ను గట్టిగా కౌగలించుకుంది. "నీ కల నిజం చేశాను రా" అంది, గొంతు వణుకుతూ.
"థాంక్స్ అక్కా" అన్నాను.
ఆమె విడిచిపెట్టి నా ముఖం చూసింది. "చిన్నప్పటి నుంచి ఇదే కదా నీకు కావాల్సింది."
నేను ఆమె వైపు చూశాను. ఆమెకు సమాధానం అవసరం లేదు. ఆమె అప్పటికే సమాధానం తెలుసు.
"అవును" అన్నాను.
ఆమె నవ్వింది. ఫోన్ తీసుకుంది. ఏదో టైప్ చేసింది. బహుశా తన భర్తకి "తమ్ముడి కల నిజం చేశాను" అని.
నేను గాజు అవతల మైక్ వైపు చూశాను.
మైక్ స్టాండ్ ఇంకా ఒక అంగుళం ఎత్తుగానే ఉంది.



